హిజాబ్ ధరించేలా ఏకగ్రీవ తీర్పు వస్తుందని ఆశిస్తున్నా: ఓవైసీ

హిజాబ్ ధరించేలా ఏకగ్రీవ తీర్పు వస్తుందని ఆశిస్తున్నా: ఓవైసీ
  • ఖురాన్లో హిజాబ్ ధరించాలని ఎక్కడా లేదని హైకోర్టును ట్రాన్స్ లేటర్స్ తప్పుదోవ పట్టించారు
  • విద్యాసంస్థల్లో రిలీజియన్ యాక్సప్టెన్సీ అనేది ఎప్పటినుంచో ఉంది: అసదుద్దీన్ ఓవైసీ

హైదరాబాద్: హిజాబ్ అంశాన్ని బీజేపీ కావాలనే ఇష్యూగా మార్చిందని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. హిజాబ్ పై ఇవాళ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన భిన్న తీర్పుపై అసదుద్దీన్ స్పందించారు. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ సుధాన్షు ధులియా హిజాబ్ ను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పును అసదుద్దీన్ ఓవైసీ స్వాగతించారు. గతంలో కర్ణాటక హైకోర్ట్ హిజాబ్ కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఆయన వ్యతిరేకించారు. ఖురాన్ లో హిజాబ్ ధరించాలని ఎక్కడా లేదని హైకోర్ట్ న్యాయమూర్తులను ట్రాన్స్ లేటర్స్ తప్పుదోవ పట్టించారని తెలిపారు. విద్యాసంస్థల్లో రిలీజియన్ యాక్సప్టెన్సీ అనేది ఎప్పటినుంచో ఉందని ఓవైసీ చెప్పారు. కర్ణాటకలో ముస్లిం విద్యార్థినిలు హిజాబ్ ధరించేలా ఏకగ్రీవ తీర్పు రావాలని తాను ఆశిస్తున్నానని అసద్ స్పష్టం చేశారు.

ఇకపోతే... హిజాబ్ అంశంపై సుప్రీం కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ అంశంపై ద్విసభ్య ధర్మాసనంలోని జడ్జిలు భిన్న తీర్పులు వెలువరించారు. జడ్జిల్లో ఒకరైన జస్టిస్ హేమంత్ గుప్తా కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థించగా.. మరో జడ్జి జస్టిస్ సుధాన్షు ధులియా హైకోర్టు ఉత్తర్వులను వ్యతిరేకించారు. కేసుకు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న  జస్టిస్ హేమంత్ గుప్తా హిజాబ్ను సమర్థిస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. కర్నాటక హైకోర్టు తీర్పుపై దాదాపు 10 రోజుల పాటు ద్విసభ్య ధర్మాసనం విచారణ జరగగా సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ లో ఉంచింది.తాజాగా తీర్పు వెలువరించింది.

హిజాబ్ ధరించే అంశం కేవలం వ్యక్తుల ఇష్టాయిష్టాలకు సంబంధించిన అంశమే తప్ప ఇంకేం కాదని జస్టిస్ హేమంత్ గుప్తా అభిప్రాయపడ్డారు. తన దృష్టిలో అమ్మాయిల చదువే అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని అన్నారు. పిటిషనర్లను 11 ప్రశ్నలు అడిగిన జస్టిస్ హేమంత్ గుప్తా.. చివరకు కర్నాటక హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్లు ప్రకటించారు. అయితే తన సహచర జడ్జి జస్టిస్ సుధాన్షు ధులియా తన తీర్పుతో ఏకీభవించనందున ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తికి రిఫర్ చేశారు. భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువడిన నేపథ్యంలో సీజేఐ కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసే అవకాశముందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.